విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. చైర్మన్ ను మార్చేందుకు రాష్ట్ర సర్కారు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి ప్లాంట్లపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ( K. Chandrashekar Rao ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి తీరును తప్పుపట్టింది.విచారణ పూర్తి కాకముందే ఆయన ఓ అభిప్రాయానికి ఎలా వస్తారని ప్రశ్నించింది. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే, మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ చైర్మన్‌గా మరో పేరును వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.