SC: అనుమతి లేకపోతే సీఎస్ జైలుకే: సుప్రీంకోర్టు
చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా అని సూటి ప్రశ్న.. పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తామన్న కోర్టు;
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్... తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా.. అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. అనంతరం తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసును సమోటోగా విచారణకు స్వీకరించి తక్షణం అక్కడ జరుగుతున్న పనులపై స్టే విధించడంతోపాటు అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ)ని ఆదేశించింది. దాంతో ఆయా వ్యవస్థలు తమ నివేదికలను దాఖలు చేయడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్‌సింఘ్వీ, మేనకా గురుస్వామి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా, సీఈసీ తరఫున అమికస్‌క్యూరీ పరమేశ్వరన్, మరికొందరు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఎస్.నిరంజన్‌రెడ్డి, గోపాల్‌శంకర్‌నారాయణన్‌లు వాదనలు వినిపించారు. వాల్టా కింద స్వీయధ్రువీకరణ ద్వారా కొన్ని రకాల చెట్లను తొలగించేందుకు వెసులుబాటు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో చెట్లను కొట్టేసిందని తెలంగాణ తరఫున వాదించిన అభిషేక్‌సింఘ్వీ తొలుత ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ భూమిని తాకట్టు పెట్టిన విషయాన్ని తెలంగాణ సీఎస్ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని అమికస్‌క్యూరీ పరమేశ్వరన్ చేసిన వాదనలతో జస్టిస్ గవాయ్ విభేదించారు. ‘‘ఈ భూమి యాజమాన్య హక్కులు ఎవరివన్న విషయం జోలికి మేం వెళ్లడంలేదు. దాన్ని ధ్రువీకరించే అధికారం సీఈసీకి లేదు. అక్కడ చెట్లు కొట్టేశారా? లేదా? ఒకవేళ కొట్టేసి ఉంటే అందుకు అనుమతులున్నాయా? లేదా? అనుమతులు లేకుండా ఎన్ని చెట్లు కొట్టేశారు? అన్నది చూడటం వరకే సీఈసీ బాధ్యత అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.