TS: పాలమూరు-రంగారెడ్డికి 60 శాతం నిధులు
కేంద్రమంత్రి షెకావత్ హామీ ఇచ్చారన్న రేవంత్‌రెడ్డి.... ఐపీఎస్ పోస్టింగ్‌లు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి;
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60 శాతం నిధులు ఇస్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇద్దరు నేతలు, కేంద్రమంత్రులు అమిత్‌షా, షెకావత్, హర్‌దీప్‌సింగ్ పురీని కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్రానికి IPS అధికారుల కేటాయింపు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు.. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేయగా 2024 బ్యాచ్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. మెట్రో రెండో దశకు..... కేంద్రం సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60శాతం నిధులిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారు.
గురువారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రితో సమావేశమైన రేవంత్‌రెడ్డి...... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని విజ్ఙప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి.... ఇప్పటికే పలు అనుమతులు తీసుకున్నా ఇంకా హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం బీసీ రేషియో, అంతరాష్ట్ర అంశాలు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయని వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ఐతే 2014 తర్వాత, కేంద్రం ఏప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని..ఆ విధానం ప్రస్తుతం అమలులో లేదని, ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 60 శాతం నిధులు కేటాయిస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు.... భేటీ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ను కలిసిన నేతలు తెలంగాణకు అదనంగా IPS అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది IPS అధికారులను కేటాయించారని జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం అదనంగా 29 అదనపు IPS పోస్టులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్‌షా 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి...రాష్ట్రానికి అదనంగా అధికారులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదం పరిష్కరించాలని, దిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని కోరారు. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను.. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడంపై దృష్టిసారించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు ,సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లను..... అదనంగా కేటాయించాలని కోరారు. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం..... హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, SHRC వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్ల ఇప్పించాలని కోరారు.