T CONGRESS: సర్వ సన్నద్ధంగా కాంగ్రెస్
త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా... టికెట్ రాని వారిని బుజ్జగించేందుకు వినూత్న ప్రణాళిక;
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఇటీవలే రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అదే ఊపుతో మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టికెట్ రాని నాయకులు నిరాశకు లోనుకాకుండా చక్కబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆశావహుల్లో టికెట్ ఎవరికి వచ్చినా.. కలిసి పని చేసేటట్లు నాయకుల్లో ఐఖ్యతను తెచ్చేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. నియోజక వర్గాల వారీగా టికెట్ దక్కని నాయకులను బుజ్జగించి కలిసి పని చేసేలా సర్దుబాటు చేసేందుకు ప్రాంతాలవారీగా, కులాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి జాబితా త్వరలో ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. స్క్రీనింగ్ కమిటీ మురళీదరన్ నేతృత్వంలో జరిగిన కసరత్తులో సగానికిపైగా నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల ఎంపిక పూర్తయ్యింది. అక్కడ CEC పరిశీలన తర్వాత మొదటి జాబితా ప్రకటన జరగనుంది. గట్టి పోటీ తమకంటే తమకు టికెట్ వస్తుందని అంచనా వేసుకుంటున్న నాయకుల్లో ఎవ్వరికి రాకపోయినా తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. కొత్తగా పార్టీలో చేరే నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. PCC వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ కూల్ పేరుతో మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి సహా... మరికొంతమందిని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెండు రోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి.. అధిష్టానం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిని సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు తాను డిమాండ్ చేసిన రెండు టికెట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆయన, అయన కుమారుడు ఇవాళ, రేపో హస్తం కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మెదక్ టికెట్ మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు, మల్కాజిగిరి టికెట్ మైనంపల్లికి ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అటు మెదక్, ఇటు మల్కాజిగి నియోజకవర్గాలల్లో టిక్కెట్లు ఆశించిన నాయకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. మల్కాజిగిరి టికెట్ తనకే దక్కుతుందన్న విశ్వాసంతో చాలా కాలంగా…పని చేసుకుంటూ వచ్చిన ఆ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తోమల్లురవి సమావేశమయ్యారు. ఇప్పుడు ఆ టికెట్ మైనంపల్లి హనుమంతురావుకు ఇవ్వాల్సి రావడంతో పీసీసీ ఆదేశాలతో తాను కలిసినట్లు శ్రీధర్‌తో తెలిపారు.