ASSEMBLY: మూడు కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం.. ప్రతిపక్షాల నిరసన మధ్య ఆమోదం తెలిపిన సభ;
తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. లగచర్ల రైతుకు సంకెళ్లు వేయడంపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ నేటికి వాయిదా పడింది.
శ్వేతపత్రం అందుకే
గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే సభలో శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదని చెప్పారు. స్పీకర్ అనుమతితో ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హరీశ్‌రావుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదూరమైన మాటలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ లోపాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే రూ.1లక్ష 27 వేల కోట్ల అప్పు
తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలోనే రూ.1.27 వేల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం రూ.6.36 వేల కోట్ల అప్పు చేయబోతోందని అన్నారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.4.47 లక్షల కోట్ల అప్పు ఉంటే.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చెబుతున్నారని మండిపడ్డారు.
చేతులకు బేడీలతో అసెంబ్లీకి BRS ఎమ్మెల్యేలు
అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. లగచర్ల ఘటనపై చర్చకు అనుమతించకపోవడంతో బ్లాక్ షర్టులు ధరించి.. చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాటి రాజ్యం.. లూటీ రాజ్యం… రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.