ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్‌లు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లికృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వరకు కొనసాగింది.రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి.. విధివిధానాల ఖరారు కోసం మంత్రి వర్గ ఉప సంఘం ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో రైతుభరోసాపైన చర్చించనున్నారు. అలాగే ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ , ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్నది అసక్తిగా మారింది.