తెలంగాణలో అధికార బీఆర్‌ఆర్ దూకుడు పెంచింది. విపక్షాల కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 71 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం తొలిజాబితాను అధికారంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొదటి జాబితాలో దాదాపుగా సిట్టింగ్‌లకే స్థానం దక్కింది. పలువురు సీనియర్ నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినా...బీఆర్‌ఎస్ అధిష్టానం సమ్మతించలేదు. మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోన్న కేసీఆర్ ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు నిరాకరించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక సర్వేల ఆధారంగా కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో.. ఆశావహులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టారు. దాదాపు 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫస్ట్ లిస్ట్‌లో స్థానం లేదని సమాచారం. దీంతో.. మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని సిట్టింగుల్లో టెన్షన్ మొదలయ్యింది.