CM KCR Tour.. 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
ప్రధానంగా సాగర్ ఎడమ కాల్వ అభివృద్ధి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించడం;
నాగార్జున సాగర్ నియోజకర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 2వేల 395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ ఆయకట్టు, నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞత సభగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ప్రధానంగా సాగర్ ఎడమ కాల్వ అభివృద్ధి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ఫ్లోరైడ్ నుంచి విముక్తం చేయడంతో పాటు కొత్తగా ఎత్తిపోతల పథకాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకుని టీఆర్‌ఎస్ ప్రచారం చేయనుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సభ ఏర్పాట్లను చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ సభకు కార్యకర్తలు, రైతులు, ప్రజలను సమీకరిస్తున్నారు.
నాగార్జునసాగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్దిరోజుల్లోనే జరిగే వీలుంది. దీంతోపాటు త్వరలో రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సీఎం ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు సాగర్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపైనా సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక సీఎం సభ నేపథ్యంలో రెండు లక్షల మందిని సమీకరిస్తున్నారు. ప్రధానంగా ఉప ఎన్నిక జరిగే సాగర్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని రప్పించేలా... కార్యాచరణ రూపొందించారు.