REVANTH: అంతా కోచింగ్ సెంటర్ల మాఫీయా కుట్ర

పరీక్షల వాయిదాకు కోచింగ్ సెంటర్ల మాఫీయా ప్రయత్నిస్తోందన్న రేవంత్‌.... ధనదాహంతో చేస్తున్నారని మండిపాటు;

Update: 2024-07-10 02:30 GMT

తెలంగాణలో కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ధైర్యం చేస్తే.. ఎప్పుడు పార్టీ బలహీనపడితే.. అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారని అన్నారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండని బీఆర్‌ఎస్‌ నేతలకు రేవంత్‌ సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే.. బిల్లా రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని రేవంత్ సూచించారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని... నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని రేవంత్‌ అన్నారు.

అంతా దొంగల గూడుపుఠాణీ

గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాణీ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను కేటీఆర్, హరీశ్‌రావు రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్‌రె‌డ్డి ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌.. ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని రేవంత్‌ మండిపడ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. డిసెంబరు 9వ తేదీ నాటికి గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులు, డీఎస్సీ ద్వారా 11,500 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే బీఆర్ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పరీక్షలు వాయిదా పడాలని కుట్రలు పన్నుతున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏవేవో అభ్యంతరాలు తెలియజేస్తున్నారన్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. వారిద్దరు యువతను రెచ్చగొట్టడం వల్లే గతంలో చాలా మంది పేదల పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని.... ఆ నేతల కుటుంబాలు మాత్రం బాగున్నాయన్నారు.

కేటీఆర్, హరీశ్ రావులకు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని.. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవనే ఇలా కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదన్నారు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చో అని రేవంత్ అన్నారు. నాలుగు రోజులుగా హరీష్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.... తనదాకా వస్తే గాని వాళ్లకు నొప్పి తెలియలేదు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాణీ చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News