REVANTH: రేవంత్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన అందుకేనా...?

మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు... దసరాలోపు మంత్రివర్గ విస్తరణ..!;

Update: 2024-10-01 01:30 GMT

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించేందుకే రేవంత్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. వైద్య చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హర్యనా, కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో హైకమాండ్ నేతలు బిజీగా ఉన్నందున వారితో సమావేశమయ్యే అవకాశం లేదని, కేవలం ఈ ఒక్క పని మీద మాత్రమే ఆయన ఢిల్లీ వెళ్లారని పేర్కొన్నాయి. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 5న పూర్తవుతున్నందున ఆ తర్వాత మరోసారి వెళ్ళి హైకమాండ్ నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.

దసరాలోపు మంత్రివర్గ విస్తరణ!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలారోజులుగా నాన్చుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు ఆమోదం పొందేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. దసరాలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న వేళ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

హైడ్రా కూల్చివేతల వల్లేనా

హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నదని, వారికి వివరణ ఇచ్చేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారన్న చర్చ జరుగుతున్నది. దీంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడుల గురించి కూడా అధిష్ఠానం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీకి వెళ్లడం ఇది 23వ సారి కావడం విశేషం.

Tags:    

Similar News