REVANTH: రైతులకు ముఖ్యమంత్రి శుభవార్త

సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు ఇస్తామని వెల్లడి... రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘం;

Update: 2024-12-02 02:00 GMT

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. రైతు భరోసా పై మంత్రి వర్గ ఉపసంఘం వేశామన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. రైతు భరోసా కొనసాగుతుంది.. ఎవరికీ అనుమానాలు వద్దు అన్నారు. BRS, BJP నేతల మాటలు రైతులు నమ్మోద్దన్నారు. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దని చెప్పారు. వరికి రూ.500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు

కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పులమయంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ సర్కార్ ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న ముఖ్యమంత్రి.. 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న లోన్స్ అన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి.. ఇప్పటివరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని సీఎం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులామని విమర్శించారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చిద్దాం రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

6న ఢిల్లీకి రైతుల పాదయాత్ర

హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దు, ఖానౌరీ సరిహద్దులలో నిరసనలు చేస్తున్న రైతులు డిసెంబరు 6న ఢిల్లీకి పాదయాత్ర చేపట్ట తలపెట్టారు. ట్రాక్టర్ ట్రాలీలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో ఈసారి ఆ రోజు రైతులు వివిధ బృందాలుగా కాలినడకన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్టు తెలిపారు. రైతులు రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయాణం కొనసాగిస్తారు.

Tags:    

Similar News