REVANTH: తెలంగాణలో న్యూయార్క్‌ను తలదిన్నే నగరం
బెగరికంచను నాలుగో సిటీగా నిర్మిస్తామన్న రేవంత్‌రెడ్డి... సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన;
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను నిర్మిస్తే.. రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచను నాలుగో సిటీగా ఈ ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు. ఈ విషయంలో కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి... నాలుగేళ్లలో బెగరికంచ ప్రాంతాన్ని న్యూయార్క్ కంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తామని తెలిపారు. బంజారాహిల్స్‌లో ఉండే వాళ్ల మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకొనేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టబడులు తెచ్చి హెల్త్, స్పోర్ట్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామన్నారు.
రంగారెడి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో వర్సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని, ఇక్కడ వర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందని సీఎం అన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
స్కిల్ యూనీవర్సిటీపై.....
అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది. ఆనాడు దేశంలో 90శాతం పైగా జనాభా వ్యవసాయం, కులవృత్తులు, చేతి వృత్తుల మీద అధారపడి జీవిస్తున్న క్రమంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకుని వచ్చారన్నారు. ఇందులో వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు.హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని తెలిపారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్నారు. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు.