REVANTH: ప్రతిపక్ష నేతలకు రేవంత్‌రెడ్డి సవాల్

మూసీ ఒడ్డున 3 నెలలు నివసించాలన్న రేవంత్.. అలా చేస్తే ప్రాజెక్టు ఆపేస్తామని స్పష్టీకరణ;

Update: 2024-10-18 03:00 GMT

మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రతీదీ రాజకీయం చేస్తే దశాబ్దాల దురవస్థ మారదని అన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న విపక్షపార్టీలకు తెలంగాణ సీఎం సవాల్‌ విసిరారు. మూడునెలలు వారు మూసీ ఒడ్డున ఉండగలిగితే.. ప్రాజెక్ట్‌ ఆపేస్తామని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవ కార్యక్రమమని తేల్చి చెప్పారు. కాలుష్యం నుంచి విముక్తికోసం చేపట్టిన కార్యక్రమాన్ని ఆహ్వానించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ మూసీ పరివాహకంలో మూడు నెలల పాటు నివసించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలకు సీఎం సవాల్ విసిరారు. వారు మూసీ ప్రాంతంలో నివసిస్తే వారి ఇంటి అద్దె తానే చెల్లిస్తానని తెలిపారు. ఇలా చేస్తే తమ ప్రభుత్వం పలు కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేస్తానని, ఆ సంస్థకు తన ఆస్తి అమ్మి పరిహారం చెల్లిస్తానని వెల్లడించారు. మూసీ నిర్వాసితుల స్థితిగతులు, వారి కుటుంబాలపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే పునరావాసం కల్పించామన్నారు రేవంత్‌రెడ్డి. అధికారులు దగ్గరుండి అన్నీ చూసుకున్నారన్నారు.

పేదల సమస్యలు తీర్చాలనే..

కాంగ్రెస్‌ దార్శనికత వల్లే దేశానికి ప్రపంచంతో పోటీపడే శక్తి లభించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. నెహ్రూ, రాజీవ్, పీవీలు ప్రవేశపెట్టిన పాలసీలను కొందరు వ్యతిరేకించారు. కానీ, ఆ విధానాలే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాయి. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణను ప్రభుత్వం తీసుకుందన్నారు. 33 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి.. పేదల సమస్యలను తెలుసుకున్నాయని.. విధిలేని పరిస్థితుల్లో.. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదలను ఎలా ఆదుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని అన్నారు.

ఎప్పుడైనా న్యాయం చేశారా..?

బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్వాసితులకు ఎప్పుడైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి రావడానికైనా తాను సిద్ధమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే రచ్చబండ పెట్టి ప్రజలతో అన్ని విషయాలూ చర్చిద్దామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దామగుండంలో రాడార్‌ కేంద్రంపై వస్తున్న విమర్శలపై సీఎం స్పందించారు. దేశభద్రతకు సంబంధించిన విషయాలను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు.

Tags:    

Similar News