Revanth Reddy: డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

మార్పు వచ్చింది.. కాంగ్రెస్ వస్తోంది అంటూ ఆనందం;

Update: 2023-12-01 03:00 GMT

రాష్ట్రంలో పోలింగ్ సరళిని విశ్లేషిస్తే అధికారంలోకి వచ్చి తీరుతామని  కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు అనుకూలంగా ఉండటం... పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో మరింత విశ్వాసాన్ని పెంచింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపునకే మొగ్గు చూపాయి. భారాస కంటే 20 నుంచి 25 సీట్లు అధికంగా వస్తాయని పార్టీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థులు ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఏఐసీసీ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. అభ్యర్థుల ప్రకటనలో కొంత ఆలస్యం అయినప్పటికీ గెలిచేందుకు అవకాశం ఉన్నవాళ్లనే అభ్యర్థులగా ఎంపిక చేసింది. టికెట్ దక్కని ఒకరిద్దరూ పార్టీ విడిచి పెట్టినప్పటికీ మిగిలిన అసంతృప్తులను సమర్థంగా సముదాయించగలిగింది. ప్రచారం దగ్గర నుంచి అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయడం.. పోల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారాసను గట్టిగా ఢీకొట్టగలిగామని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ.. మల్లికార్జున ఖర్గే... సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ తదితరులతో పాటు... ఏఐసిసి నుంచి 150 మందికి పైగా క్షేత్రస్థాయిలో, 100 మందికి పైగా వార్‌రూమ్‌లో పనిచేశారు. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలను కూడా.. అభ్యర్థులకు తెలియజేశారు. 

పీసీసీ అధ్యక్షుడు తన నియోజకవర్గంతోపాటు.. 63 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 10 నియోజకవర్గాలలో మల్లికార్జున ఖర్గే.. 23 నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ, 26 నియోజకవర్గాలలో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. అధికార భారాస, భాజపాలు చేస్తున్న విమర్శలను గట్టిగా బదులివ్వవడంతోపాటు .. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ వచ్చారు. అత్యధిక స్థానాల్లో గెలుస్తామని రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో ధీమా వ్యక్తం చేశారు.  ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మ్యాజిక్ ఫిగర్‌ వస్తుందని ధీమాగా ఉన్నప్పటికీ... పార్టీ అభ్యర్థులు చేజారిపోకుండా కాంగ్రెస్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Tags:    

Similar News