TG: కొరమీను పెంపకానికి తెలంగాణలో భారీ ప్రాజెక్టు
రూ.15 కోట్లతో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు... ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో నిర్మాణం;
రాష్ట్ర చేప కొరమీను పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టడంతోపాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో కొరమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనుంది.
తెలంగాణలో కొరమీనును శతాబ్దాల చరిత్ర
తెలంగాణ కొరమీనుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది పొడవైన, చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన దీన్ని 2016లో ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడడానికి, వాటి సంఖ్యని పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరిచింది. దీనికి ఓ వైపు డిమాండ్ పెరుగుతుండగా... మరోవైపు పెంపకం తగ్గుతోంది. ఇంకోవైపు హైబ్రిడ్, క్యాట్‌ఫిష్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరమీను ప్రాశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీని కోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.
రూ. 15 కోట్లతో నిర్మాణం
ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో రూ.15 కోట్లతో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో కొరమీనుతోపాటు ఆ జాతికే సంబంధించిన బురదమట్టలు, పూలమట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హాచరీలు ఏర్పాటు చేస్తారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే పిల్లలను రాష్ట్రవ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. మృగశిరకార్తెలో చేప ప్రసాదానికి వాడతారు. వినియోగానికి వీలుగా విక్రయశాలలకు పంపిస్తారు. తెలంగాణ అవసరాలు పోనూ మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తారు. ఎల్లంపల్లిలో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే కార్యాచరణ చేపడతామని రాష్ట్ర మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్ తెలిపారు. ఫలితంగా ఇవి విస్తృతంగా లభ్యం కావడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉందని చెప్పారు.