తెలంగాణ లోని ఆయిల్ పామ్ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506గా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణమాఫీ, రూ.7625 వేల కోట్ల రైతుబంధు, రూ.3వేల కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు గుర్తుచేశారు.
మరోవైపు.. రైతు భరోసా పథకంపైనా కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి తుమ్మల. రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చించడం మాత్రమే చేశామన్నారు. చర్చల ఫలితాలను కేబినెట్‌లో పెడతామని వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో రెండ్రోజుల్లో దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతు భరోసా డబ్బులు అర్హులకే ఇవ్వాలని తాము డిసైడ్ అయినట్లు చెప్పారు.