రైతు రుణమాఫీకి పీఎం కిసాన్ స్కీమ్ నిబంధనలను అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, IT చెల్లించేవారు తదితరులకు కేంద్రం పీఎం కిసాన్ అమలు చేయడం లేదు. దీంతో రుణమాఫీకి కూడా ఇవే మార్గదర్శకాలు అనుసరిస్తే అర్హులైన వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై జూన్15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రుణ మాఫీకి ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? అర్హుల గుర్తింపునకు విధివిధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు సమాచారం.
అటు జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒకటి లేదా రెండు రోజులపాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. అలాగే సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం.