TS: స్కూల్లో గిన్నెలు కడుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

పంతుళ్లు, పంతులమ్మలే.. వంట మాష్టారు అవతారం ఎత్తుతున్నారు

Update: 2023-07-17 12:30 GMT

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెతో.. వంట చేయడం, వండిన గిన్నెలు కడిగే బాధ్యతలు ఉపాధ్యాయుల మెడకు చుట్టుకున్నాయి. ఓవైపు పిల్లలకు చదువు చెప్పుకుంటూ.. మరోవైపు వంట చేయడం వారికి ఇబ్బందిగా మారుతోంది. గవర్నమెంట్ స్కూల్‌లకు వచ్చే పిల్లలు దాదాపు పేద, బడుగు-బలహీనవర్గాలకు చెందినవారే ఉండటంతో.. వారికి మెనూ ప్రకారం మిడ్-డే మీల్ ఇవ్వాల్సి వస్తుంది. చేసేదిలేక.. పంతుళ్లు, పంతులమ్మలే.. వంట మాష్టారు అవతారం ఎత్తుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో.. మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెతో.. ఆ ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులపై కనిపిస్తోంది. వారి చిరకాల డిమాండ్లలో ప్రధానమైన.. జీవో 8 ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలు తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే నినాదంతో రోడ్డెక్కారు.

AITUC ఆధ్వర్యంలో వంట కార్మికులు చేస్తోన్న నిరవధిక సమ్మె మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో.. పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్ వంటచేసే తాత్కాలిక బాధ్యత..స్కూల్ హెడ్ మాష్టర్లు, టీచర్లపై పడింది. దీంతో.. గత్యంతరం లేక.. మధ్యాహ్న భోజనం వంటలో.. వారంతా నిమగ్నమయ్యారు.

ఉదయం స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. మధ్యాహ్నం భోజన ఏర్పాటు చేస్తున్నారు. వంట పాత్రలను క్లీన్ చేయడం.. విద్యార్థుల సంఖ్యను బట్టి.. మెనూ ప్రకారం వంటచేయడం.. ఆ తర్వాత ఆ వంట పాత్రలను క్లీన్ చేయడం వంటి పనులన్నీ ఉపాద్యాయులే చేస్తున్నారు. అకస్మాత్తుగా వంటచేసే కార్మికులు సమ్మెకు దిగడంతో.. తప్పని పరిస్థితుల్లో వంట చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా.. పేద, బీద, బడుగు-బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటం.. వారి తల్లిదండ్రులు కూలిపనులు, వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో.. మధ్యాహ్న భోజనం ఇక్కడే చేయాల్సి వస్తుందని విద్యార్ధులు అంటున్నారు. అయితే.. తమకు విద్యాబుద్దులు నేర్పంచే టీచర్లే వంట మాష్టారు పాత్ర పోషించడం కాస్త బాధగా ఉన్నప్పటికీ.. వారి చేత్తో చేసిన వంటను తినడం సంతోషంగా ఉందని విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాలీచాలనీ జీతాలు.. పెరిగిన నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలకు తగ్గట్టుగా మెనూ చార్జీలు పెంచాలని.. తమ చిరకాల డిమాండ్లను పరష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెబాట పట్టగా.. స్టూడెంట్స్ కడుపు మాడ్చలేక.. విద్యబుద్దులతో పాటు ఉపాధ్యాయులు వంటలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనె స్పందించి.. న్యాయబద్దమైన మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News