TG: ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సబబే అన్న హైకోర్టు
విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. అనర్హులను ఎంపిక చేస్తే కోర్టును ఆశ్రయించవచ్చన ధర్మాసనం;
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా లబ్ధిదారులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 సబబేనని పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఒకవేళ రూల్స్‌కు వ్యతిరేకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగితే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ జారీ అయిన జీవో 33ను సవాలు చేస్తూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ, మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు.
హోరాహోరీ వాదనలు
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గ్రామసభ, వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత ప్రభుత్వం డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసిందన్నారు. ఇందిరమ్మ కమిటీల సభ్యుల నియామకాలకు సంబంధించి జీవోలో ఎలాంటి అర్హతలను పేర్కొనలేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచి, ప్రత్యేక అధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్, కార్పొరేటర్ ఛైర్మనుగా ఉంటారని పేర్కొన్నారు. స్వయం సహాయక గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు సభ్యులుగా ఉంటారని వివరించారు. లబ్ధిదారుల తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని, గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. దీనివల్ల పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయం అంతిమం కాదని, కలెక్టరుకు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారన్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు సాయం మాత్రమే చేస్తాయని, అర్హుల ఎంపికకు గ్రామసభలకు చట్టం అధికారం కల్పించిందన్నారు. అనర్హులను ఎంపిక చేస్తే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపై ఉంటుందని విధాన నిర్ణయాల్లో న్యాయసమీక్ష పరిధి తక్కువని అని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటానికి ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అందువల్ల ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని న్యాయయూర్తి వెల్లడించారు. ఒక లక్ష్యానికి విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్లు తేలితే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.