TS : కాంబోడియాలో తెలంగాణవాసికి చిత్రహింసలు

Update: 2024-05-28 06:49 GMT

విదేశాలలో ఉద్యోగాల పేరిట ఓ ప్రైవేట్ ఏజెన్సీని నమ్మి అనేక ఇబ్బందులు పడుతున్న ఓ బాధితుని విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం చేయాలనే తపనతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన సదరు ఏజెన్సీనను బ్యాంకాక్ కు తీసుకెళ్లింది.

కొద్దిరోజుల తర్వాత ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నామని చెప్పి కాంబోడియా తరలించారు. అక్కడ ఒక ముఠాలో చేర్చారు. వారు రకరకాల పనులు చేయిస్తూ సరిగ్గా భోజనం కూడా పెట్టకుండా, వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. చిత్రహింసలకు గురిచేస్తూ, మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రకాష్ వాట్సప్, వీడియో కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

ఇక్కడ భాదలు పడలేనని తనను తీసుకెళ్లండి అంటూ కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియోల ద్వారా సమాచారం అందించాడు. దీంతో తన అన్న, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రకాష్ ను కాపాడాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News