తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కేంద్ర ప్రభుత్వ వివక్ష కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్‌లు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం... ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులకు సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో గత నాలుగు నెలలుగా ఉద్దేశపూర్వకంగానే ఎరువుల ఉత్పత్తి జరగడం లేదని మంత్రి ఆరోపించారు. ఈ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అవసరమైన 11 లక్షల టన్నులకు గాను కేవలం 5.2 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా అయ్యాయని, ఈ వైఫల్యానికి బీజేపీనే బాధ్యత వహించాలని అన్నారు. రైతుల సహకారంతో బీజేపీ పై ఒత్తిడి పెంచుతామని మంత్రి ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రస్తావించారు. "యూరియా ఎవరిస్తే వాళ్లకే ఓటు వేస్తాం" అని కేటీఆర్ గతంలో చెప్పారని, ఇప్పుడు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని.. బీఆర్ఎస్ సభ్యులు 'తెలుగు బిడ్డకు' ఓటు వేయాలని పరోక్షంగా సూచించారు. మొత్తానికి, తెలంగాణలో ఎరువుల కొరత రాజకీయ వివాదంగా మారడమే కాదు...ఉప రాష్ట్రపతి ఎన్నికలను కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళింది.