తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేయటంతో పల్లెల్లో సందడి మొదలైంది. ఇన్ని రోజులు బీసీ రిజర్వేషన్ల అంశం వల్ల ఈ ఎన్నికలు పెండింగ్లో పడ్డాయి. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ముందు జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ ఈసారి అలా కాకుండా జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిర్వహిస్తామని.. ప్రస్తుతానికి పార్టీలతో సంబంధంలేని సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా ప్లాన్ రెడీ చేసి పెట్టారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఇప్పటికే ఆయా గ్రామాలలో ఎవరికి ఏ రిజర్వేషన్ వచ్చిందో తేలిపోయింది. ఈనెల 27న షెడ్యూల్ వస్తుందని అంటున్నారు.
ఇన్ని రోజులు ఎలాంటి ఎన్నికలు లేకుండా గ్రామాల్లో పార్టీల నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో మళ్ళీ పాత రాజకీయాలు మొదలవుతున్నాయి. పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మేజర్ గ్రామపంచాయతీలో ఒకే పార్టీ తరఫున ఎక్కువ మందిని నిలబెట్టకుండా కొందరిని ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఎవరిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవాలో పార్టీలు మీటింగులు పెట్టి డిసైడ్ చేస్తున్నాయి. అలా డిసైడ్ చేసిన వారికే మిగతా పార్టీ నేతలు అందరూ సపోర్ట్ చేసి గెలిపించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
కులాలపరంగా మీటింగులు పెట్టడం మొదలైంది. కొందరు సర్పంచ్ అభ్యర్థులు అప్పుడే రకరకాల హామీలను ఇవ్వటం స్టార్ట్ చేశారు. గ్రామాల్లోని అన్ని వర్గాలతో మాట్లాడుతూ పానెల్ ను రెడీ చేసుకుంటున్నారు. ఈసారి పార్టీలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో బలమైన పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నాయి. పార్టీలో గుర్తుతో సంబంధం లేకపోయినా సరే పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టి మిగతావారు ప్రచారం చేయటానికి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చు అన్నది అన్ని పార్టీల ప్లాన్.