తెలంగాణలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈనెల 26న స్కీమ్‌ను ప్రారంభించనున్నారు.
మరోవైపు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.