Telangana Municipal Polling : మున్సిపల్ పోలింగ్.. నాయకుల తీరు విడ్డూరం..

Update: 2026-02-12 12:14 GMT

ఎట్టకేలకు తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన పోలింగ్ లో చాలా చోట్ల కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిజంగా చాలా చోట్ల ఇలాంటివి ఎవరూ ఊహించలేదు. కానీ అనుకోకుండా జరిగిన గొడవల్లో పోలీసులే మాటలు పడాల్సి వచ్చింది. ఓ వైపు అధికార పార్టీ నాయకులు, ఇంకోవైపు ప్రతిపక్షాల నేతల ఒత్తిడి పోలీసులపై స్పష్టంగా కనిపించింది. అయినా సరే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా అభినందనీయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులపై మాట్లాడిన తీరు కొంత విడ్డూరంగానే అనిపించింది. పోలీసులు ఎక్కడైనా సరే బందోబస్తు నిర్వహిస్తారు.

ఎలాంటి గొడవలు జరగకుండా గస్తీ నిర్వహించడమే వారి బాధ్యత. అయినా సరే చాలా చోట్ల పోలీసులను తప్పుబడుతూ తిట్టడం కూడా కనిపించింది. అటు నిజమాబాద్ లో ఎంపీ అరవింద్ కూడా పోలీసులపైనే తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఇంకొన్ని చోట్ల ప్రతిపక్షాల లీడర్లు పోలీసులనే మాటలు అంటున్నారు. ఇదంతా నిజంగా పోలీసులు ఫేస్ చేయాల్సి రావడం ఒక రకంగా బాధాకరమనే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే పోలీసులున్నదే శాంతిభద్రతలను కాపాడటం కోసం.

అంతే గానీ గొడవలు సృష్టిస్తుంటే చూస్తూ మౌనంగా ఉండటం కోసం కాదు. ఏదైనా గొడవ జరిగితే మళ్లీ ఆ పోలీసులే సరిగ్గా పనిచేయలేదని తిడతారు. ఇలా ఎటు చూసినా పోలీసుల బాధ్యతలపై కొంత ఒత్తిడి కనిపిస్తూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద గొడవలు ఏవీ జరగకపోయినా.. ఇలాంటి ఘర్షణలు జరగడం ఎవరూ ఊహించనివే. మరి ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదే జరుగుతుందా లేదా అన్ని ఒక్క రోజులో తేలిపోనుంది.

Tags:    

Similar News