తెలంగాణలో కీలకమైన కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై ఓ క్లారిటీ రానుంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణాల పరిశీలన, అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీ మార్చి 6న రానుంది.
కాళేశ్వరం పరిశీలనకు రానున్న ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఎన్‌డిఎస్‌ఎ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడానికి గల కారణాలపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేస్తోందని, అన్నారం, సుందిళ్ల రెండు అప్‌స్ట్రీమ్ బ్యారేజీల దుస్థితిని పరిశీలిస్తుందని తెలిపారు ఉత్తమ్.
మేడిగడ్డ బ్యారేజీ పైర్లు మునిగిపోవడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగే నష్టాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరడంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం వెంటనే నీటిని ఖాళీ చేయాలని సిఫారసు చేసింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల తనిఖీల అనంతరం ఇలాంటి సమస్యలను గుర్తించి వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసింది. అయితే ఆ బ్యారేజీలను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కుట్రలు చేస్తున్నామంటూ బీఆర్‌ఎస్ నాయకులు రివర్స్ ఎటాక్ చేస్తున్నారని..వారికి సాంకేతిక పరిజ్ఞానం లేదని చెబుతున్నారు.