జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లాగా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో గ్రేటర్ లో కొంత టాక్ మారింది. హైదరాబాద్ లోనే కీలకంగా ఉండే జూబ్లీహిల్స్ లో ఓడిపోతే గ్రేటర్ లో గులాబీ పార్టీకి పట్టు తగ్గిందని అంటారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి.. రాజధానిలో తమకు పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుర్తుల బెడద వచ్చి పడింది. కారు గుర్తును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే అవకాశం ఉండటంతో.. గులాబీ పార్టీలో టెన్షన్ మొదలైంది.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేయడానికి ఫైనల్ అయ్యారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ఎంత లేదన్న ఎనిమిది మందికి కారు గుర్తు లాంటి గుర్తులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ గుర్తుల వల్ల తమకు భారీగా దెబ్బ పడుతోందని గులాబీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి గుర్తుల వల్లే తాము భారీగా నష్టపోయామని.. ఈజీగా గెలిచే చోట కూడా ఓడిపోయామని చెబుతున్నారు. పెద్దగా ప్రభావం లేని స్వతంత్ర అభ్యర్థులకు 8000 10,000 ఓట్లు ఈ గుర్తుల వల్లే వచ్చాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఈ కారు గుర్తును పోలిన ట్రక్కు, లారీ లాంటి గుర్తుల వల్ల నష్టపోయామని చెబుతున్నారు.
కాబట్టి తమ కారు గుర్తును పోలిన ఇతర గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని అప్పట్లోనే సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ అందజేశారు. కానీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఇలాంటి గుర్తులను ఈసీ కేటాయిస్తూ వస్తోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరోసారి ఇలాంటి గుర్తుల వల్ల తాము ఓడిపోతే ఎలా అని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎంత కష్టపడ్డా.. ఎంత ప్రచారం చేసినా.. ప్రజలు తమకు ఓటు వేయలేక.. కన్ఫ్యూజ్ అయ్యి ఇతర గుర్తులకు ఓటేస్తున్నారని చెబుతున్నారు గులాబీ నేతలు. కాబట్టి ఈసీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించొద్దని కోరుతున్నారు.