CM Revanth : చిన్నారుల భద్రతే మా బాధ్యత... లైంగిక దాడులకు పాల్పడితే వదిలేదే లేదన్న సీఎం

Update: 2025-07-05 17:00 GMT

మహిళలు, చిన్నారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత" అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న సిఎం మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టమని, వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులపై జరిగే లైంగిక హింసను సమాజంలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వాటి ద్వారా బాధితులకు పూర్తి భద్రత, సహకారం అందిస్తున్నామని వివరించారు.

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు, ముఖ్యంగా యువత సోషల్ మీడియా వాడకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News