Tamilisai Soundararajan: గవర్నర్- ప్రభుత్వం మధ్య వివాదానికి ముఖ్య కారణం అదే..

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌.. ఢిల్లీవేదికగా.. .తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Update: 2022-04-06 12:58 GMT

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌.. ఢిల్లీవేదికగా.. .తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ బాహాటంగానే తెలంగాణ సర్కారుపై విమర్శనాస్త్రాలను సందించారు. తాను రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్నానని.. ప్రభుత్వంతో చాలా స్నేహపూర్వకంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నానని గవర్నర్ వెల్లడించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలుసున్నారు. ఒక వ్యక్తిగా కాకుండా...రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ను గౌరవించాలన్నారు. ఏ విషయంలో నైనా సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. రాజ్‌భవన్‌-ప్రగతి భవన్ మధ్య దూరం గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య చాలా రోజులుగానే వివాదం నడుస్తోంది.

గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గ‌వ‌ర్నర్ ఆమోదించ‌కపోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ వ‌ర్గాలు కౌశిక్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఆమోదించాల‌ని కోరిన‌పుడు.. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయ‌ని చెప్పారు. అలాగే అతను ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారనే సమాచారం లేకపోవడంతో అతని అభ్యర్ధిత్వాన్ని నిలిపివేసినట్లు తెలిపారు.

అయితే గ‌వ‌ర్నర్ ఉద్దేశ‌పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును తొక్కిపెట్టారన్న వాద‌న టీఆర్‌ఎస్‌ వర్గాల్లో బలంగా నాటుకుంది. దీంతో గవర్నర్‌- ప్రగతి భవన్‌కు దూరం పెరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌ సందర్బంగా గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం గవర్నర్‌కు- ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడానికి కారణమైంది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించడంపై కూడా తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌ తప్పుబట్టారు. ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ.. కొనసాగింపు అనడం అనైతికమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆనాడు గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరించిన గవర్నర్.. సమయం తీసుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ... రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తానని ప్రకటించారు. దానిలో భాగంగానే ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశారు.

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ ఉత్సవాలకు గవర్నర్ వెళ్లిన సందర్బంగా మరోసారి ప్రజా ప్రతినిధులు దూరంగా ఉన్నారు. స్వాగతం పలికేందుకు ఒక్కప్రజా ప్రతినిధికూడా రాకపోవడంతో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనిపించింది. అక్కడ ఉన్న అధికారులు తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు. గవర్నర్‌ను దగ్గరుండి దర్శనం చేయించాల్సిన ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో రాజ్‌భవన్‌ -ప్రగతి భవన్‌ మధ్య వివాదం మరోసారి బహిర్గతమైంది.

అయితే నాగర్ కర్నూలులో గిరిజనులు, ఆదివాసీల పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటించిన గవర్నర్ టూర్‌లోను ప్రజా ప్రతినిధులు కానరాలేదు. అధికారుల సమక్షంలో గవర్నర్‌ అప్పాపూర్‌లో నల్లమల ప్రాంతానికి చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్‌ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలలను గవర్నర్‌ ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యక్షంగా గవర్నర్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం తర్వాత.. గవర్నర్ స్వామి దర్శనానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా స్వాగం పలుకాల్సిఉంటుంది. కానీ ఇక్కడ వారెవరు రాలేదు. కేవలం ఆలయ అధికారులు మాత్రమే గవర్నర్ కు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. ప్రభుత్వానికి- రాజ్‌భవన్‌కు మధ్య వివాదం గవర్నర్ యాదాద్రి పర్యటన ద్వారా మరోసారి చర్చనీయాంశమైంది. 

Tags:    

Similar News