RAINS: మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ.. అప్రమత్తమైన అధికారులు;

Update: 2024-08-30 03:30 GMT

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల.. శనివారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్.. ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాగే ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

తాజాగా భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎండీ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

పలు రాష్ట్రాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఉన్నతాధికారులు గ్రేటర్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే రేపటి నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ భారీ వర్షాలు కురిసే దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News