హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్‌ఛార్జీలు 5% పెరిగాయి. వాహనాలను బట్టి ఆరు కేటగిరీలుగా విభజించగా.. కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవీ, ఎస్వీయూ వాహనాలకు ప్రతి కి.మీకి రూ.2.34, ఎల్‌సీవీ, మినీ బస్సుకు రూ.3.77, బస్సు, 2 యాక్సిల్ ట్రక్కుకు రూ.6.69, 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు రూ.8.63, భారీ నిర్మాణ యంత్రాలు-4,5,6 యాక్సిల్ ట్రక్కులకు రూ.12.40, ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్ ఉండే వాహనాలకు కి.మీకు ₹15.09 వసూలు చేస్తారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ సంస్థ గత ఏడాది 30 ఏళ్ల లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెలుసుబాటు సంస్థకు ఉంది.
ఏటా టోల్‌ఛార్జీలు ఏప్రిల్ 1న పెంచుతుండగా.. ఈసారి సార్వత్రిక ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 1తో చివరిదశ పోలింగ్ ముగియడంతో టోల్ ధరల పెంపునకు ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.