హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆకాశం నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతంలో దాదాపు గంటన్నరపాటు వర్షం పడింది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
భారీ వర్షం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. హయత్‌నగర్ నుంచి నగరంలోకి వెళ్లే వాహనాలు రహదారిపై నీరు నిలవడంతో ముందుకు కదలలేకపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్‌తో పాటు మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెం.మీ, పాతూరులో 8 సెం.మీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గాంధీనగర్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్-హైదరాబాద్ హైవేపై కూడా భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీ సాయంతో డివైడర్‌ను తొలగించి నీటిని మళ్లించారు.