తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన ఐదో సోదరి చీటి సకలమ్మ రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదితుదిశ్వాస విడిచారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయని తెలుస్తోంది. సకలమ్మ మరణంపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు. దీంతో.. బీఆర్ఎస్ కీలక సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు ఇతర ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావాల్సి ఉంది. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతితో ఈ సమావేశం వాయిదా పడినట్లు చెబుతున్నారు.
సకలమ్మది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. సకలమ్మ భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. సకలమ్మ, హన్మంతరావు దంపతలుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మొత్తం 10 మంది తోబుట్టువులు ఉన్నారు. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి. 2018లో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి, మరో సోదరి లీలమ్మ చనిపోయారు. ఏటా అక్కలు, చెల్లి ఏటా కేసీఆర్ కు రాఖీ కడుతుంటారు.