TS : ఏప్రిల్ 30న తెలంగాణ సచివాలయం ప్రారంభం
సచివాలయం ప్రారంభం కాగానే.. ముందుగా తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ఆసీనులవుతారు;
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం నూతన భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉదయం శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను రహదారులు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిర్వహిస్తారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఆ ముహూర్త సమయాన్ని త్వరలో ప్రకటిస్తారు. సచివాలయం ప్రారంభం కాగానే.. ముందుగా తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ఆసీనులవుతారు. అనంతరం మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ తమ ఛాంబర్లలో కూర్చుంటారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, జిల్లా గ్రంథాలయాల ఛైర్‌పర్సన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మేయర్లు తదితరులు పాల్గొంటారు. మొత్తం దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా.
నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాటిల్లో వాయువ్య ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు. ఈశాన్య ద్వారం నుంచి సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలుంటాయి. పార్కింగు కూడా అదే వైపు ఉంటుంది. ఆగ్నేయ ద్వారం సందర్శకుల కోసం మాత్రమే. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. తూర్పు గేటును ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఛైర్మన్లు, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగిస్తారు. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్ బగ్గీలను ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయం రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.