KISHAN REDDY: కొనసాగుతున్న కిషన్‌రెడ్డి దీక్ష
ధర్నా చౌక్‌లో దీక్ష భగ్నం చేసిన పోలీసులు... తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత;
తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష కొనసాగుతోంది. ధర్నాచౌక్‌లో నిరసనకు దిగిన కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీక్ష భగ్నం చేశారు . అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. కిషన్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా KCR సర్కార్‌పై పోరాటం సాగించాలని సూచించారు. నిరుద్యోగ దీక్ష విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ.... నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు భాజపా పిలుపునిచ్చింది.
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు చుట్టుముట్టారు. ఇందిరాపార్కు వద్ద నిరసనలు, ఆందోళనలకు 6గంటల వరకే అనుమతి ఉంటుందంటూ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయనను బలవంతంగా బీజేపీ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారు.
కిషన్‌రెడ్డిని తరలిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కిషన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కార్యకర్తల సపర్యలతో తేరుకున్న ఆయనను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించారు. నిరసనల మధ్యే కిషన్‌రెడ్డిని వాహనంలో భాజపా తెలంగాణ కార్యాలయానికి తీసుకెళ్లగా అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కాగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటన గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్‌షా దృష్టికి పార్టీ వర్గాలు తీసుకెళ్లాయి. కిషన్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన అమిత్‌షా... కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని సూచించారు. కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.