తెలంగాణ మహిళా మంత్రులు కొండా సురేఖ ( Konda Surekha ), సీతక్క ( Seethakka ) మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సమ్మక్క సారక్క జాతరలో మంత్రి సీతక్కకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాక్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వీరి వ్యవహారం వెళ్ళిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి మహిళా మంత్రులు ఫుల్ స్టాప్ పెట్టారు. శుక్రవారం వరంగల్ లో సీఎం ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సోదరుడు వేం పురుషోత్తం రెడ్డి సంవత్సరీకం జరిగింది. హనుమకొండ హంటర్ రోడ్ లోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ఇరువురు ఆప్యాయంగా పలకరించుకోవడం, మంత్రులు ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం కనిపించింది. తమ మధ్య విభేదాలు లేవని వారు చెప్పకనే చెప్పారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.