CM KCR : సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు వెళ్తారా..?
CM KCR : ప్రగతి భవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సైతం సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై వేదిక పంచుకోవడం లేదు.;
ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో శుభకృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు తమిళిసై సౌందర్‌రాజన్. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. క్యాబినెట్ మంత్రులతో పాటు విపక్ష పార్టీల అధ్యక్షులకు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌కు మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడిన నేపథ్యంలో.. ఇప్పుడేం జరుగుతుందనేదానివైపే అందరి చూపు ఉంది. గతంలో నరసింహన్ వున్నప్పుడు రాజ్‌భవన్‌లో జరిగే ప్రతి కార్యక్రమానికి సీఎం హాజరయ్యేవారు. తమిళిసై గవర్నర్‌గా వచ్చిన మొదట్లోనూ KCR అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
ఐతే.. కేంద్రం డైరెక్షన్‌లో కొన్ని విషయాల్లో గవర్నర్ తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారంటూ కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా కూడా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు రాజ్‌భవన్ వేడుకలకు దూరంగా ఉన్నారు. మంత్రులు కూడా ఎవరు అటువైపు వెళ్లలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్‌కు కనీస ప్రోటోకాల్ పాటించ లేదనే విమర్శలూ వచ్చాయి. ఇటీవల జరిగిన యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి కూడా గవర్నర్‌ను ఆహ్వానించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో జరిగే ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ వెళ్ళటం డౌటే అంటున్నారు. రేపు పండుగ కాబట్టి ప్రగతి భవన్‌లో జరిగే వేడుకలకు సంబంధించి ఐదు రోజుల ముందే షెడ్యూల్ విడుదల చేశారు. కానీ ఒకరోజు ముందే ఇవాళ రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహిస్తుండటంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తానికి ఈ వ్యవహారం చివరికి ఎక్కడి దాకా వెళ్తుందోననే చర్చ జరుగుతోంది.