తాము చేయి ఎత్తినా బస్సును ఆపలేదని నలుగురు మహిళలు డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. వెనకాలే వచ్చిన మరో బస్సులో వెళ్లి.. ఆ డ్రైవర్‌తో గొడవపడ్డారు. మాటా మాటా పెరగడంతో డ్రైవర్‌పై చేయిచేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడకు చెందిన నలుగురు మహిళలు పీఏపల్లిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై మిర్యాలగూడకు వెళ్లేందుకు అంగడిపేట స్టేజీ వద్ద బస్సు కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు.
అయితే, డ్రైవర్ స్టేజీకి దూరంగా బస్సు ఆపగా.. పరుగెత్తుకుంటూ వెళ్లిన మహిళల్లో ఇద్దరు మాత్రమే బస్సు ఎక్కారు. ‘మా వాళ్లు వస్తున్నారు.. బస్సు ఆపండి’ అని చెప్పినా ఆపకపోవడంతో.. బస్సెక్కిన ఇద్దరు మహిళలు కిందకు దిగారు. వెనకాల వస్తున్న మరో బస్సులో వారు మిర్యాలగూడకు చేరుకున్నారు. తమను ఎక్కించుకోకుండా డిపోకు చేరుకున్న బస్సు వద్దకు వెళ్లిన ఆ మహిళలు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
మాటామాటా పెరగడంతో బస్సు డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. డ్రైవర్ టూటౌన్ పోలీసులకు ఫోన్ చేయడంతో.. వారు వచ్చి ఆ మహిళలను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే బస్సు డ్రైవర్ తమ పట్ల అమర్యాద, అసభ్యంగా ప్రవర్తించాడని మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేదేమీలేక ఆ డ్రైవర్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. అనంతరం పోలీసులు ఇరువురికి సర్ది చెప్పారు.