TG: సున్నిత అంశాలపై అవగాహన కల్పిస్తున్న "సంస్కార్ టాయ్"

వరంగల్ జిల్లా వాసి యాకర గణేష్ అద్భుత ఆవిష్కరణ.. ప్రధాని మోదీతోనూ శభాష్ అనిపించుకున్న గణేష్;

Update: 2024-12-03 02:00 GMT

మనతోనే ఉంటారు... పక్కనే తిరుగుతుంటారు... కరుణను కురిపిస్తుంటారు.. ప్రేమగా మాట్లాడుతుంటారు.. నమ్మించి నలిపేయాలని ప్రయత్నిస్తుంటారు.. ఇప్పుడు సమాజంలో నిత్యం జరుగుతున్న దారుణాలు ఇవే. స్త్రీ అయితే చాలు పసి పిల్లలు, వృద్ధులనే తేడా లేకుండా కొందరు మృగాళ్లుగా మారిపోతున్నారు. మానవీయ విలువలకే సమాధి కట్టి, మనుషులమేనా అని అనుమానం వచ్చే దుర్ఘటనలు.... మనచుట్టూ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ దారుణాల్లో బయటపడేవి కొన్నే.. చాలా వరకు అస్సలు మనకు తెలియడం లేదు. కారణం... తమపై జరిగింది దారుణమని ఆ చిన్నారులకు కూడా తెలియకపోవడమే. ఈ ఆధునిక సమాజంలో ఇంకా చిన్నారులకు గుడ్ టచ్ ఏదో.. బ్యాడ్ టచ్ ఏదో చెప్పేందుకు కూడా........ చాలామంది సంకోచిస్తున్నారు. కనీస అవగాహన లేని చిన్నారులపై.. మదమెక్కిన మృగాళ్లు చేస్తున్న అకృత్యాలు.. ఆ యువకుడిని వెంటాడాయి. ఈ దారుణాలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచన అతడిని నిద్రపోనివ్వ లేదు. అంతే తన ఆలోచనలకు పదునుపెట్టి.. సమాజానికి సంస్కారం నేర్పే బొమ్మను తయారు చేశాడు. ప్రధాని మోదీ చేత కూడా శభాష్ అనిపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు.


అభం శుభం తెలియని వయసు... తమకు ఏం జరుగుతుందో కనీసం గుర్తించలేని ప్రాయం.. ఎవరు ఏ ఉద్దేశంతో తాకుతున్నారో గుర్తించలేని అమాయకత్వం.. ఇవే మృగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఈ అమాయకత్వాన్ని తొలిగించి.. మంచి, చెడు స్పర్శల గురించి చిన్నారులకు విడమరిచి చెప్పేందుకు తల్లిదండ్రులు కూడా సంకోచిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అద్భుత ఆవిష్కరణలతో ముందుకు వచ్చారు వరంగల్‌కు చెందిన యాకర గణేష్. తన ఆలోచనలకు రూపం ఇచ్చి సంస్కార్ పేరుతో ఓ బొమ్మను తయారు చేశాడు. ఈ 'సంస్కార్' బొమ్మ ఇప్పటివరకు 60వేల మంది విద్యార్థినులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించింది. ఈ సంస్కార్ బొమ్మపై ఎవరైనా చేయి వేస్తే అది బ్యాడ్ టచ్ అయితే నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుంది. ఏదీ మంచి స్పర్శో... ఏది కాదో విడమరచి చెప్తుంది.

గణేష్ సంస్కార్ బొమ్మను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ బొమ్మ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, కొంకణితో సహా ఏడు భాషలలో మాట్లాడగలదు. గణేష్ ఫస్ట్ 60 సంస్కార్ బొమ్మలు తయారు చేశాడు. ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ఓ పాఠశాల బొమ్మపై ఆసక్తి చూపింది. వాళ్లు సంస్కార్ కోసం ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం గణేష్ సంస్కార్ 2.0కి తయారు చేయడానికి రెడీ అవుతున్నాడు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కూడా గణేష్ ఆవిష్కరణలను మెచ్చుకున్నారు. " నేను మరింత ప్రభావవంతంగా ఉండే హ్యూమనాయిడ్‌ బొమ్మను తయారు చేయానుకుంటున్నా " అని గణేష్ తెలిపారు. "తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలతో 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి మాట్లాడానికి ఇబ్బంది పడతారు. సంస్కార్ బొమ్మ దీని గురించి మాట్లాడటాన్ని సులభతరం చేసింది" అని గణేష్ చెప్పారు. అమ్మాయిలను అనుచితంగా తాకకూడదనే విషయం అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా తెలియాలని గణేష్ అన్నారు.

Tags:    

Similar News