తల్లి దహన సంస్కారాలకు బిచ్చం ఎత్తిన బాలిక.. చలించిన గ్రామం, సమాజం

Update: 2024-08-19 09:15 GMT

తల్లిదండ్రులను కోల్పోయి... నా అనేవారు లేక అనాథగా మారిన ఓ చిన్నారి.. తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేక బిక్షాటన చేసిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేతాడ గ్రామంలో ఇటీవలే తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి గంగామణి (36) కూలీ చేసుకుని ఒక్కగానొక్క కూతురు పదకొండేళ్ల దుర్గను సర్కారు బడిలో చదివిస్తోంది. గత రెండు మూడు రోజులుగా తల్లి గంగామణి మనస్తాపంతో ఉంటూ శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ హత్యకు ఒడిగట్టింది.

తెల్లారేసరికి తల్లి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన ఆ చిన్నారి తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఇంటిముందు ఒక గుడ్డ పర్చుకుని బిక్షాటన చేసిన సంఘటన ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. ఈ ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

తల్లిదండ్రులను కోల్పోయిన దుర్గ అనే బాలిక డబ్బులను సేకరించి తల్లి అంత్యక్రియలు చేసిన ఘటన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కదిలించి వేసింది. ఆదివారం సాయంత్రం దుర్గతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, అధికార యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ధైర్యాన్ని నూరిపోసారు. బాగా చదువుకోవాలని, ఇందుకోసం తాను సహాయపడతానని కలెక్టర్ బాలికకు తెలిపారు. ఈ సంఘటనను సోషల్ మీడియాలో చూసి చలించారు కేటీఆర్ సహా పలువురు నేతలు. కార్యకర్తల ద్వారా అందజేశారు. సేకరించిన డబ్బులతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా పెద్దదిక్కు ఎవరూ లేరని బెంగపడవద్దని, అన్ని విధాలా చూసుకుంటామని మంత్రి కేటీ రామారావు ఆ బాలిక కోసం పదివేల రూపాయల సత్వర ఆర్థిక సహాయం పంపించారు. చివరకు దహన సంస్కారాల్లో కూతురే కన్నతల్లి చితికి కొరివిపెట్టింది.

Tags:    

Similar News