Dharmasthala Case : ధర్మస్థల కేసు.. సంచలన విషయాలు చెప్పిన ఫిర్యాదుదారుడు

Update: 2025-08-19 07:15 GMT

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల శ్మశానవాటికలో వందలాది మృతదేహాలను ఖననం చేసినట్లు ఆరోపణలు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ కేసులో తనకు ఒక పుర్రె ఇచ్చి, సిట్ అధికారులకు ఇవ్వాలని కొందరు వ్యక్తులు సూచించారని.. అలాగే వారే న్యాయస్థానంలో అర్జీ కూడా వేయించారని భీమా తెలిపాడు. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని.. వారే తనను కర్ణాటకకు తీసుకొచ్చి ఇదంతా చేయించారని చెప్పాడు. భీమా ఇచ్చిన కొత్త సమాచారం ఆధారంగా, అతన్ని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ తెలిపింది.

లై డిటెక్టర్ పరీక్షకు డిమాండ్

ఈ కేసుపై కర్ణాటక విధానసభలో కూడా చర్చ జరిగింది. భీమాకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ.. భీమా చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని.. అయితే ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా మృతదేహాలు లేదా అస్థిపంజరాలు లభించలేదని తెలిపారు. భీమా వాదనల్లో నిజం లేకపోవడంతో అధికారులు ఈ కేసును మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబర్లకు హోంమంత్రి హెచ్చరిక

తప్పుడు కథనాలను ప్రసారం చేసే యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ హెచ్చరించారు. ఈ కేసులో తప్పుడు సమాచారం వ్యాప్తి కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News