Pataabi Raman: ఒకప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్.. ఇదే పట్టాభి రామన్ కథ..

Pataabi Raman: 20 ఏళ్ల పాటు పట్టాభి రామన్.. ముంబాయిలోని పోవాయ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడట

Update: 2022-03-30 06:09 GMT

Pataabi Raman: ఎవరి జీవితం ఎప్పుడు, ఎలా మారిపోతుందో తెలియదు. ఈరోజు మన చేతిలో ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి అనుకుంటే రేపటికి రేపు అవన్నీ చేజారిపోవచ్చు. కానీ ఏం జరిగిన ఆత్మస్థైర్యం ఉండాలి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. తాజాగా అలాంటి ఓ వ్యక్తి గురించి బెంగుళూరులో వైరల్ అవుతోంది. ఆయనే 74 ఏళ్ల పట్టాభి రామన్.

బెంగుళూరుకు చెందిన రెసర్చర్ నిఖితా అయ్యర్ తన ఆఫీస్‌కు లేట్ అవుతుందని అటుగా వెళ్తున్న ఆటోను ఆపింది. ఆ ఆటోను నడుపుతున్న వ్యక్తే పట్టాభి రామన్. అప్పుడు నిఖితా ఆయనతో తన ఆఫీస్ చాలా దూరమని, లేట్ అవుతుందని చెప్పింది. దానికి ఆయన 'పదండి మేడమ్ నేను తీసుకెళ్తాను. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి' అంటూ ఇంగ్లీషులో సమాధానం ఇచ్చాడు. అది విని షాక్ అయిన నిఖితా వెంటనే ఆ ఆటో ఎక్కి తన కథేంటో తెలుసుకుంది.

20 ఏళ్ల పాటు పట్టాభి రామన్.. ముంబాయిలోని పోవాయ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడట. అయితే అక్కడి నుండి కర్ణాటకకు వచ్చేసిన తర్వాత తన పేరు పట్టాభి రామన్ అని చెప్పగానే.. నీ సామాజిక వర్గం ఏంటి అని అడిగి ఆ తర్వాత ఎదరూ ఉద్యోగం ఇచ్చేవారు కాదట. అలా తనకు ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో ఆటో డ్రైవర్‌గా మారాడట పట్టాభి రామన్.

ఆ వయసులో తాను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసినా కూడా తనకు పెన్షన్ రాదని.. అక్కడ వచ్చే జీతం కూడా తనకు, తన భార్యకు సరిపోదని అన్నాడట పట్టాభి రామన్. ఆటో నడుపుతూ రోజుకు రూ. 700 నుండి 1500 వరకు సంపాదిస్తున్నానని తెలిపాడట.

తన భార్యకు 72 ఏళ్ల వయసు ఉంటుందని, తాను 9 నుండి 10 గంటల వరకు బయట పనిచేస్తుంటే.. తన భార్య ఇల్లు చూసుకుంటుందని చెప్పాడట పట్టాభి రామ్. ఈ కథను అంతా నిఖితా అయ్యర్ తన లింక్డ్ ఇన్‌లో రాసింది. చాలామంది నెటిజన్లు ఈ కథకు కనెక్ట్ అయిపోతున్నారు.



Tags:    

Similar News