ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ( Hajj Pilgrims ) ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు.
కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది. ఈద్-ఉల్-అజా పండుగ కోసం సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. ఇక ఈ ఏడాది హజ్ యాత్రలో 1.8 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ యాత్ర బుధవారంతో ముగియనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు తీవ్ర ఎండలు ఉంటాయని, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సౌదీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.