Bangladesh: ముజిబ్ బయోపిక్‌లో షేక్ హసీనా పాత్ర పోషించిన నటి అరెస్ట్..
నటి నుస్రత్ ఫరియాను ఢాకా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..;
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె పార్టీ ఆవామీ లీగ్, ఆమె మద్దతుదారుల్ని టార్గెట్ చేసిన యూనస్ ప్రభుత్వం, తాజాగా బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఢాకాలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆమెను ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, థాయ్‌లాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
2024 హింసాత్మ విద్యార్థి ఉద్యమంలో హత్యాయత్నం కేసులో ఈమె ప్రమేయం ఉందనే ఆరోపణలో రెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢాకా ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్దే ఈమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల నుస్రత్ ఫరియా నటిగా, మీడియా పర్సనాలిటీగా బంగ్లాదేశ్‌లో ఫేమస్. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్త నిర్మాణంలో ఆషికి: ట్రూలవ్‌తో నటనా రంగ ప్రవేశం చేశారు. ప్రఖ్యాత భారతీయ చిత్ర ప్రముఖుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత చరిత్ర అయిన ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ (2023)లో షేక్ హసీనాగా ఫరియా నటించారు.
2024 హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో అవామీ లీగ్ ప్రతీ ప్రయత్నానికి ఫరియా నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హింసాత్మక అణిచివేతకు ఆమె మద్దతు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. బడ్డా జోన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ షఫీకుల్ ఇస్లాం, ప్రోథోమ్ అలోకు ఆమె అరెస్టును ధృవీకరించారు. విమానాశ్రయంలో ఆమెను నిర్బంధించిన తర్వాత, ఫరియాను మొదట వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు, తరువాత తదుపరి విచారణ కోసం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయానికి బదిలీ చేశారు.