పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్ తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్ కు అమెరికా సూచనలు చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడినట్లు విదేశాంగ ప్రతినిధి తెలిపారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో వీరు మాట్లాడుకోవడం గమనార్హం.
పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఇక, ఇటీవల రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని ఆయన ప్రతిపాదించారు. ఈసందర్భంగా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.
భారత్-పాక్‌లు సంయమనం పాటించాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈసందర్భంగా ఇరుదేశాల మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. భారత్- పాక్‌లలోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని, శాంతిస్థాపన కోసం ఇరుదేశాలు చర్చలు జరపాలని ప్రతిపాదించాయి.