చైనా వైరస్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : డొనాల్డ్ ట్రంప్
అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో ‘చైనా వైరస్’ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో..;
అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో 'చైనా వైరస్'ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనకోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం ట్రంప్ తొలిసారి శనివారం ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. సెనెటర్‌గా, ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన..... అమెరికా ఉద్యోగాలను చైనాకు ఎగుమతి చేశారని ఆరోపించారు. బైడెన్ అధికారంలోకి వస్తే... డెమొక్రాటిక్ పార్టీ అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వబోనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. నల్ల జాతి, లాటిన్ అమెరికన్లకు డెమొక్రాటిక్ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. వారిని గతంలో బైడెన్ తీవ్ర నిర్లక్ష్యం చేశారని అన్నారు.
అటు... ట్రంప్ ఆరోపణల్ని బైడెన్ తిప్పికొట్టారు. ట్రంప్ హయాంలో నిరుద్యోగం మనుపెన్నడూ లేని స్థాయికి పెరిగిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలిందని విమర్శించారు. ట్రంప్ హయాంలో ధనవంతులు మరింత సంపన్నంగా.. పేదలు నిరుపేదలుగా మారారని విమర్శించారు.
ట్రంప్ నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని శ్వేతసౌధంలోని వైద్యుడు సియాన్ కాన్లే వెల్లడించారు. సీడీసీ నిబంధనల ప్రకారం ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చని తెలిపారు. ఆయనలో వృద్ధి చెందుతున్న క్రియాశీల వైరస్ ఆనవాళ్లు లేవని తెలిపారు. ట్రంప్‌లో వైరస్ పూర్తిగా తొలగిపోకున్నా.. అత్యల్ప స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు.