బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తర్వాత నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది..