Burkina Faso: బుర్కినా ఫాసోలో మరోసారి చెలరేగిన హింస..

అల్‌ఖైదా ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు 200 మంది మృతి..;

Update: 2024-08-27 06:15 GMT

 అంతర్యుద్ధంతో సతమతమవుతున్న బుర్కినా ఫాసోలో మళ్లీ హింస చెలరేగింది. వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్  అనే జిహాదీలు జరిపిన తుపాకీ కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోగా.. మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్‌ స్పెషలిస్ట్‌ ఒకరు చెప్పుకొచ్చారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. బర్సాలోగో దగ్గర శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి భద్రతా అవుట్‌పోస్టులను రక్షించడానికి కందకాలు తవ్వుతుండగా వారిపై జిహాదీలు కాల్పులకు దిగారు. ఈ దాడిలో అనేక మంది సైనికులు, ప్రజలు చనిపోయారని అల్‌ఖైదా ప్రకటించింది.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను అల్‌ఖైదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ దాడి జరగబోతోందని బుర్కినా ఫాసో సైన్యానికి శుక్రవారం సమాచారం వచ్చింది.. కందకాలు తవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని నికోలస్ హక్ అనే స్థానిక రిపోర్టర్ పేర్కొన్నాడు. ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కయా పట్టణం నుంచి పిలిపించారు. బుర్కినా ఫాసో దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అక్కడి ప్రజలలో వేలాది మందిని చంపేశారు. ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు మరణించారని ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News