జిన్‌పింగ్ తస్మాత్ జాగ్రత్త.. బైడెన్ హెచ్చరిక
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించిన బైడెన్... జాగ్రత్తగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్...;
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఘాటుగా హెచ్చరించారు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే పర్యవసానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. చైనా ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల పెట్టుబడులపై ఆధారపడి ఉందనే విషయం మర్చిపోవద్దని అగ్రరాజ్య అధినేత సూచించారు. ఓ ఇంటర్వ్యూలో జిన్‌పింగ్ రష్యా పర్యటనపై అడిగిన ప్రశ్నకు బైడెన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌లోకి రష్యా ప్రవేశించినప్పటి నుంచి 600 అమెరికన్ కంపెనీలు ఆ దేశం నుంచి వైదొలిగాయని గుర్తు చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థ యూరప్, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆధారపడి ఉన్నట్లు జిన్‌పింగ్ ఒక సందర్భంలో తన చెప్పాడన్న బైడెన్... అయితే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇది బెదిరింపు కాదని... పరిశీలన మాత్రమే అని వ్యాఖ్యానించారు.
అమెరికా-చైనా మధ్య అనేక అంశాల్లో తీవ్రస్థాయి విభేదాలున్నాయి. తైవాన్, ఉక్రెయిన్ సంక్షోభం, సాంకేతిక పరమైన అంశాలతో ఇరు దేశాల మధ్య బంధం బలహీనంగా ఉంది. రెండింటి మధ్య ఇటీవల చిప్ వార్ మొదలైంది. జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒకదానిపై ఒకటి ఆంక్షలు విధించుకుంటూనే ఉన్నాయి. సమాచార విప్లవానికి వారధిగా ఉన్న సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దాంతో.. ఎన్నిరకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన అమెరికా ఈ ప్రాజెక్ట్ నుంచి చైనా కంపెనీలను తప్పించడంలో సక్సెస్ అయింది.
మార్చిలో జిన్‌పింగ్ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు . యుద్ధం విషయంలో రష్యా చర్యలను అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తోన్న సమయంలో ఈ పర్యటన జరిగింది. దీంతో చైనా తీరుపై ప్రపంచదేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ చైనా పర్యటనలో ఉన్నారు. అగ్రరాజ్య కంపెనీల పట్ల డ్రాగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని విమర్శించారు. సెమీ కండక్టర్లలో ఉపయోగించే లోహాలపై చైనా కొత్తగా ఎగుమతి కంట్రోల్‌లను విధించడంపై ఆమె మండిపడ్డారు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీనే అమెరికా కోరుకుంటోందని యెలెన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు అమెరికా నిర్దిష్ట చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చైనా తెలిపింది.