ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. శత్రు సైన్యంలో కీలక నేతలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా మరో ముఖ్యనేత నబిల్‌కౌక్ మరణించాడు. తమ రాకెట్ దాడుల్లో హెజ్‌బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై హెజ్‌బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.
శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈ దాడి నుంచి కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది. నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. నబిల్‌పై 2020లో అమెరికా ఆంక్షలు విధించింది. హెజ్బొల్లా వద్ద ఇప్పటికీ పెద్ద ఎత్తున రాకెట్లు, మిసైల్స్, ఆయుధాలు ఉన్నాయని, అందువల్ల ఇంకా ముప్పు తొలగిపోలేదని షోషానీ తెలిపారు.
నస్రల్లా హత్యకు ప్రతీకారంగా హెజ్బొల్లా తీవ్ర స్థాయిలో దాడులు చేయొచ్చని, అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. నస్రల్లా అంతంతో తమ పోరాటం ముగిసిపోలేదని, దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ ప్రకటించారు. గాజా తరహాలో లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.