Larissa: హర్యానా ఓటరు జాబితాలో తన పేరు ఉండటంపై... బ్రెజిలియన్ మోడల్ స్పందన
స్టాక్ ఇమేజ్ నుంచి తన ఫొటోను కొని దుర్వినియోగం చేశారని వెల్లడి
హర్యానా ఓటర్ల జాబితాలో తన ఫొటోను దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సదరు బ్రెజిలియన్ మోడల్ స్పందించారు. తనకు భారత రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఎవరో తన ఫొటోను స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసి దుర్వినియోగం చేశారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు బ్రెజిలియన్ భాషలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫొటోను 22 వేర్వేరు పేర్లతో ఓటర్ల జాబితాలో చేర్చారని నవంబర్ 5న రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో తన ఫొటో వైరల్ కావడంతో బ్రెజిల్‌కు చెందిన మాజీ మోడల్ లారిస్సా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత భారతీయ జర్నలిస్టుల నుంచి తనకు డజన్ల కొద్దీ సందేశాలు వచ్చాయని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా లారిస్సా తన వీడియోలో మాట్లాడుతూ.. “హలో ఇండియా, భారతీయ జర్నలిస్టులు నన్ను అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను. నాకు భారత రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. నేను ఎప్పుడూ భారతదేశానికి కూడా రాలేదు. నేను బ్రెజిల్‌కు చెందిన మాజీ మోడల్‌ని, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. నాకు భారత ప్రజలంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా సీరియస్‌గా మారింది. జర్నలిస్టులు నా గురించి వెతుకుతున్నారు, ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు మోడలింగ్ కూడా చేయడం లేదు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను” అని వివరించారు.
ప్రస్తుతం మోడలింగ్ వృత్తికి దూరంగా ఉన్న లారిస్సా, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ప్రమేయం లేకుండా భారత రాజకీయ వివాదంలోకి తనను లాగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.